దీపావళి పండుగ విశిష్టత చరిత్ర| Why Do We Celebrate Diwali
దీపావళి. దీపం జ్యోతిః పరంబ్రహ్మ దీపం సర్వతమోపహమ్ |
దీపేన సాధ్యతే సర్వమ్ సంధ్యా దీప నమోஉస్తుతే ||
జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి. నరకాసురుడనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. అలాగే లంకలోని రావణుడిని సంహరించి శ్రీరాముడు సతీసమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినపుడు కూడా ప్రజలు ఆనందోత్సవాల మధ్య దీపావళిని జరుపుకున్నారని రామాయణం చెపుతోంది. చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు.
ఆశ్వయుజ బహుళ చతుర్దశి నరక చతుర్దశిగా ప్రసిద్ధి పొందింది. నరకాసురుడు నే రాక్షసుడు చెలరేగి సాధు జనాలను పీడిస్తూ దేవ, మర్త్య లోకాలలో సంక్షోభాన్ని కలిగిస్తుంటాడు. కృతయుగంలో హిరణ్యాక్షుని వధించిన వరాహస్వామి కి, భూదేవికి అసుర సంధ్యా సమయంలో జన్మిస్తాడు నరకుడు. అతడు లోక కంటకుడైనా మహావిష్ణువు వధించరాదని, తల్లియైన తన చేతిలోనే మరణించేలా వరం పొందుతుంది భూదేవి. మహావిష్ణువు ద్వాపరయుగంలో శ్రీకృష్ణ భగవానునిగా అవతరించినప్పుడు భూదేవి సత్యభామగా జన్మిస్తుంది.
అప్పటికి నరకాసురుడు లోక కంటకుడై చేస్తున్న అధర్మకృత్యాలను అరికట్టడానికి సత్యభామా సమేతంగా తరలి వెళ్తాడు శ్రీకృష్ణుడు. వారి మధ్యజరిగిన భీకర సంగ్రామంలో భూదేవి అంశ అయిన సత్యభామ శరాఘాతాలకు మరణిస్తాడు నరకుడు. తన పుత్రుని పేరైనా కలకాలం నిలిచి ఉండేలా చేయమని సత్యభామ ప్రార్థించడంతో ఆ రోజు నరక చతుర్థశిగా పిలువబడుతుందని వరం ప్రసాదిస్తాడు శ్రీకృష్ణుడు. నరకుని చెరనుండి సాధుజనులు,' పదహారువేలమంది రాజకన్యలు విడిపించబడ్డారు, ధ్రర్మం సుప్రతిష్ఠమైంది.
నరకాసురుని పీడ విరగడైందన్న సంతోషంతో ఆ మరుసటి రోజు ప్రజలు సంబరాలు జరుపుకుంటారు. ఈ సంబరాలు జరుపుకునే రోజు అమవాస్య కావడంతో, చీకటిని పారద్రోలుతూ ప్రజల దీపాలతో తోరణాలు వెలిగించి, బాణాసంచా కాల్చి వేడుక చేసుకున్నారు. కాలక్రమంలో అదే దీపావళి పర్వదినంగా మారింది.
దీపాలపండుగ అయిన దీపావళి రోజున మహాలక్ష్మీ పూజను జరుపుకోవడానికి ఓ విశిష్టత ఉంది.
పూర్వం దుర్వాస మహర్షి ఒకమారు దేవేంద్రుని ఆతిథ్యానికి సంతసించి, ఒక మహిమాన్వితమైన హారాన్ని ప్రసాదించాడు. ఇంద్రుడు దానిని తిరస్కార భావముతో తన వద్దనున్న ఐరావతం అను ఏనుగు మెడలో వెేస్తాడు అది ఆ హారాన్ని కాలితో తొక్కివేస్తుంది. అది చూచిన దుర్వాసనుడు ఆగ్రహము చెంది దేవేంద్రుని శపిస్తాడు. తత్ఫలితంగా దేవేంద్రుడు రాజ్యమును కోల్పోయి, సర్వసంపదలు పోగొట్టుకుని దిక్కుతోచక శ్రీహరిని ప్రార్థిస్తాడు. ఈ పరిస్థితిని గమనించిన శ్రీ మహావిష్ణువు దేవేంద్రుని ఒక జ్యోతిని వెలిగించి దానిని శ్రీ మహాలక్ష్మీ స్వరూపంగా తలచి పూజించమని సూచిస్తాడు. దానికి తృప్తిచెందిన లక్ష్మీదేవి అనుగ్రహంతో తిరిగి త్రిలోకాధిపత్యాన్ని, సర్వసంపదలను పొందాడని పురాణాలు చెబుతున్నాయి.
ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు చెంతనే ఉండే మహాలక్ష్మీదేవిని ఇంద్రుడు ఇలా ప్రశ్నించాడు. తల్లి నీవు కేవలం శ్రీహరి వద్దనే ఉండటం న్యాయమా? నీ భక్తులను కరుణించవా? అంటాడు. దీనికి ఆ మాత సమాధానమిస్తూ.. త్రిలోకాథిపతీ.."నన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తులకు వారి వారి అభీష్టాలకు అనుగుణంగా మహర్షులకు మోక్షలక్ష్మీ రూపంగా, విజయాన్ని కోరేవారికి విజయలక్ష్మీగా, విద్యార్థులు నన్ను ఆరాధిస్తే విద్యాలక్ష్మీగా, ఐశ్వర్యాన్ని కోరి ఆరాధించేవారికి ధనలక్ష్మీగా, వారి సమస్త కోరికలు నెరవేర్చే వరలక్ష్మీదేవిగా ప్రసన్నురాలౌతానని" సమాధానమిచ్చింది. అందుచేత దీపావళి రోజున మహాలక్ష్మిని పూజించేవారికి సర్వసంపదలు చేకూరుతాయని విశ్వాసం.
Comments
Post a Comment